నా భర్త వేరే అమ్మాయిలతో ఎఫైర్స్ నడుపుతున్నాడు.. న్యాయం చెయ్యండి!
on May 3, 2021
'వదినమ్మ', 'చంద్రలేఖ' వంటి సీరియల్స్ లో ఎంతో అమాయకపు క్యారెక్టర్లు పోషిస్తోన్న నటుడు రాజేష్ దత్తా.. రియల్ లైఫ్ లో మాత్రం తన విలనిజాన్ని చూపిస్తున్నాడు. భార్య ఉండగానే వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకొని వార్తల్లో నిలిచాడు. ఈ విషయంపై రాజేష్ దత్తా భార్య అరుణ అలియాస్ సాధన పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి కాలేదని అబద్దాలు చెప్పి వేరే అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకునేవాడని.. ఇదేంటని ప్రశ్నిస్తే తనను ఇంట్లో నుండి గెంటేశాడని.. ఆవేదన వ్యక్తం చేసింది సాధన. ఈ విషయంపై గట్టిగా నిలదీస్తే.. అంతా నా ఇష్టం, నేను ఎవరితోనైనా తిరుగుతా.. నీ ఇష్టమొచ్చింది చేస్కో అంటూ క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని సాధన చెప్పుకొచ్చింది.
2015 జూన్ 6న రాజేశ్‌తో ఆమె వివాహం విజయవాడలో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో 15 లక్షల కట్నం, పది తులాల బంగారం ఇచ్చారు. పెళ్లైన మూడు నెలల పాటు తమ సంసారం సాఫీగా సాగిందని, ఎంతో అన్యోన్యంగా ఉన్నామని చెప్పిన సాధన.. ఆ తరువాత రాజేష్ ప్రవర్తనలో మార్పొచ్చిందని.. తనను చెన్నై తీసుకెళ్లి.. అతడు మాత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేవాడని తెలిపింది. వేరే అమ్మాయిలతో తనకు పెళ్లి కాలేదని అబద్దాలు చెప్పి సంబంధాలు పెట్టుకునేవాడని చెప్పింది.
ఇదేంటని ప్రశ్నిస్తే.. తనను హింసించేవాడని.. ఒక్కోసారి అమ్మాయిలను నేరుగా ఇంటికి తీసుకొచ్చేవాడని చెప్పింది. ఈ విషయంలో గట్టిగా ప్రశ్నించినందుకు.. తనను కట్టుబట్టలతో ఇంటి నుండి గెంటేశాడని వాపోయింది. ఈ విషయంపై సాధన జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించింది. మరోపక్క రాజేష్ ఇంటి వద్ద బైఠాయించి తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది.